Write about 1830 Revolution / July Revolution in French History

Write about 1830 Revolution / July Revolution in French History

1830 విప్లవం (జులై విప్లవం) గురించి వ్రాయండి?

1789 ఫ్రెంచ్ విప్లవానికి కారణం బూర్బన్ వంశ రాజుల నిరంకుశ పాలన. మిత్ర పక్షాలు తిరిగి ప్రజాభిప్రాయానికి ఏమాత్రం విలువ ఇవ్వని నిరంకుశులైన బూర్బన్ వంశస్తులనే ఫ్రాన్స్ రాజులుగా చేయడంతో ప్రజలలో ఆవేశం పెల్లుబికింది.

పద్దెనిమిదవ లూయీ చాలా తెలివైన చక్రవర్తి. మొదట్లో ఉదారవాదిగా ప్రవర్తించినా చివరికి నిరంకుశత్వపాలననే ఎంచుకున్నాడు. 1814లో రాజుగా అధికారం స్వీకరించిన అనంతరం రాజ్యాంగ చార్టర్ ను ప్రకటించాడు. మెరుగైన పాలనకోసం అని చెప్పబడ్డ రాజ్యాంగ చార్టర్ లో ప్రజాభిప్రాయానికి విలువ ఉండాలి. కానీ ఆ చార్టర్ దానికి వ్యతిరేకంగా ఉంది.

ఓటింగ్ హక్కు భూస్వాములకు ధనిక వర్గాలకి మాత్రమే ఇవ్వబడింది.

ఎగువ సభ సభ్యులను రాజే స్వయంగా జీవిత కాల పరిమితితో ఎన్నుకున్నాడు. వారిని ప్రజలు ఎన్నుకోలేదు. ఆ విధంగా అది భూస్వాముల సభ అయింది.

రాజుకు అపరిమిత అదికారాలు ఇవ్వబడ్డాయి. పార్లమెంట్ రాజు నిర్ణయాలను మార్చలేదు.

మంత్రులు పార్లమెంటుకు కాకుండా రాజుకే జవాబుదారీగా ఉండేలా చేయబడింది.

పై కారణాల వల్ల చార్టర్ ప్రజల అభిలాషకు వ్యతిరేకంగా ఉంది.

ప్రాన్స్ లో ఆనాడు నెలకొన్న పరిస్దితులపై ఫ్రెంచ్ సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

 1. అల్ట్రా రాయలిస్టులు కూడా ప్రజాభిప్రాయనికి విలువ ఇవ్వని రాజుకు మద్దతు తెలిపారు. 1789 ఫ్రెంచ్ విప్లవం సందర్బంగా నష్టపోయిన ప్రభువర్గానికి నష్టపరిహారం చెల్లించాలని వారు భావించారు.
 2. మోడరేట్ రాయలిస్టులు రాజ్యాంగంలో తమ నమ్మకాన్ని ఉంచారు. రాజ్యాంగబద్ద రాజరికం మంచి పరిపాలనా పధ్ధతని వారు భావించారు.
 3. ఉదార వాదులు రాజ్యాంగ చార్టర్ మరింత ఉదారంగా, సామాన్య ప్రజలకు ఉపయోగంగా ఉండాలని భావించారు.
 4. కొందరు నెపోలియన్ ను కానీ అతని వారసులను కానీ రాజుగా చేయాలని భావించారు.
 5. మరి కొందరు రాచరికం పూర్తిగా విఫలమైనందున ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలని భావించారు. దీనికోసం రిపబ్లికన్లు ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అవకాశం ఇవ్వాలని భావించారు.

ఇన్ని అభిప్రాయాలు ఉన్నా అల్ట్రా రాయలిస్టులు తప్ప ఎక్కువ మంది బూర్బన్ రాజవంశాన్ని తొలగించాలని భావించారు.

పద్దెనిమిదవ లూయీ అనంతరం అతని సోదరుడు పదవ చార్లెస్ రాజయ్యాడు. రాజ్యానికి రాగానే పత్రికల మీద, వాక్ స్వాతంత్ర్యం మీద, రచనల మీద పరిమితులు విధించాడు. చర్చ్ కి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. 1827-30 మధ్య చాంబర్ ఆఫ్ డిప్యూటీస్ ను మూడుసార్లు రద్దుచేశాడు.

పూజారి వర్గం కోసం, పూజారి వర్గం చేత, పూజారి వర్గ ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. ఫ్రెంచ్ విప్లవ కాలంలో నష్టపోయిన పూజారి వర్గం, ప్రభువర్గాలకు నష్టపరిహారాన్ని చెల్లించాడు.

పదవ చార్లెస్ – పోలిగ్నాంట్

తన నిర్ణయాలను గుడ్డిగా సమర్ధించేవారిని చార్లెస్ మంత్రులుగా నియమించుకున్నాడు. పోలిగ్నాంట్ చార్లెస్ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా సమర్ధించేవాడు. చాంబర్ ఆప్ డిప్యూటీస్ పోలిగ్నాంట్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాణం చేసినప్పుడు చార్లెస్ 1830లో చాంబర్ ఆప్ డిప్యూటీస్ ను రద్దు చేశాడు.

చార్లెస్ పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు సాగుతున్న పరిస్దితులలో ప్రజలు పత్రికలు రచనల ద్వారా రాజును వ్యతిరేకించారు. పత్రికలు, వాక్ స్వాతంత్ర్యం పై నిషేధం ఉన్నందువల్ల తిరుగుబాటు తప్ప వారికి వేరే దారి లేకుండా పోయింది.

1830 జులై 26న చార్లెస్ తీసుకున్న నిర్ణయం ప్రజా విప్లవానికి దారితీసింది. 1830 జులై 26 ఆర్డినెన్స్ ద్వారా పత్రికా స్వేచ్చని కాలరాసాడు. చాంబర్ ఆఫ్ డిప్యూటీస్ ను రద్దు చేసి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. ఓటర్ల సంఖ్యను తగ్గించాడు.

1830 విప్లవం (జులై విప్లవం)

తన ఆర్డినెన్స్ వల్ల ప్రజల్లో చెలరేగబోయే అసంతృప్తిని పదవ చార్లెస్ ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు.

ఉదారవాదులు, రిపబ్లికన్లు, జాతీయవాదులంతా సాయుధ తిరుగుబాటుకై సమాయత్తం కావాలని ప్రజలకు బోధించారు. విలేకరులు విప్లవాన్ని ప్రారంభించగా, విధ్యార్దులు, కర్షకులు, రిపబ్లికన్లు వారికి తోడయ్యారు.

చార్లెస్ విప్లవకారులపై సైన్యాన్ని ప్రయోగించాడు. రాజ్యంలో అంతర్యుద్దం చోటు చేసుకుంది. విప్లవ కారులు కేవలం పదివేల మంది మాత్రమే అయినా పటిష్టమైన ప్రణాళికతో సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. ప్రధాన రోడ్లన్నిటినీ పెద్ద రాళ్లతో, బారికేడ్లతో మూసేసారు. దీనితో సైన్యం కదలికలు కష్టం అయ్యాయి.  మూడు రోజులపాటూ అంతర్యుద్దం నడిచింది. ఈ మూడురోజులను ప్రాన్స్ చరిత్రలో దివ్యమైన మూడురోజులు (Glorious three days)గా పేర్కొంటారు.  మూడురోజుల్లోనే విప్లవకారులు రాజభవనాన్ని చుట్టుముట్టారు.

జులై 30న ఆర్డినెన్స్ ను వెనక్కితీసుకుంటానని చార్లెస్ ప్రకటించినా అప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రజల ఆవేశాన్ని చల్లార్చే దారిలేక చార్లెస్ తన కుంటుంబంతో సహా ఇంగ్లండ్ కు పారిపోయాడు.

 

 

 

జులై విప్లవ ప్రాముఖ్యత

రాజకీయంగా ఈ విప్లవం పెద్దగా మార్పుని తీసుకురాకపోయినా ఫ్రాన్స్ చరిత్రలో జులై విప్లవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎగువ బూర్బన్లు అదికారంలోనుండి తొలగించబడి ఆర్లియనిస్టులుగా పిలువబడే దిగువ బూర్బన్ల చేతికి అధికారం వచ్చింది.

 1. రాజరికానికి చట్టబద్దత తొలగి జాతి మొత్తం అభిప్రాయానికి విలువ ఏర్పడింది.
 2. నిరంకుశ రాచరికం స్ధానంలో లూయీ పిలిప్ నేతృత్వంలో రాజ్యాంగ రాజరికం ఏర్పరచబడింది.
 3. విప్లవ లక్ష్యాలైన స్వేచ్చ, సమానత్వం, సౌబ్రాతృత్వాల్ని స్ధిరపరచింది.
 4. 1789 ఫ్రెంచ్ విప్లవం సాధించలేని విజయాలను జులై విప్లవం సాదించింది. సమానత్వం, లౌకికత్వం, రాజ్యాంగ స్వేచ్చ కు రక్షణ ఏర్పడింది.
 5. జులై విప్లవానికి ముందు పూజారి వర్గం, ప్రభువర్గం అపరిమిత సౌకర్యాలు, అధికారాలను కలిగి ఉంది. జులై విప్లవంతో వారు ఆ సౌకర్యాలు అధికారాలను వదులుకోవాల్సివచ్చింది.
 6. జులై విప్లవ ప్రభావం స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్, బెల్జియం, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీవంటి దేశాలపై కూాడ మనకు కనపడుతుంది. ఆ దేశాల ప్రజలు రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతోపాటూ, వియన్నా కాంగ్రెస్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కూడా ఉధ్యమించారు.
 7. సంతులిత అధికారం అనే సూత్రం ఆదారంగా ప్రభుత్వాలు నిర్మించబడ్డాయి. గ్రేట్ బ్రిటన్ లో కూడా ప్రజాస్వామ్య భావనలు ఉద్బవించాయి. మెటర్నిక్ విధానం ప్రాభవాన్ని కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *