Reasons for Russian Revolution

రష్యా విప్లవానికి కారణాలు వ్రాయండి?

నిరంకుశ రాచరిక వ్యవస్ధకు వ్యతిరేకంగా రష్యాలో విప్లవం చెలరేగింది. భూస్వాముల ఆగడాలు, క్రొత్తగా వచ్చిన పారిశ్రామికీకరణ వల్ల ఏర్పడిన శ్రమదోపిడీ చేయబడి, అత్యంత హేయమైన పరిస్ధితుల్లో జీవిస్తున్న కార్మిక వర్గం, కర్షక వర్గానికి తోడవగా, టాల్ స్టాయ్, గోర్కీ, మార్క్స్, లెనివ్ వంటి మేధావుల రచనల వల్ల ప్రభావితులైన సామాన్య ప్రజలు రాచరికానికి వ్యతిరేకంగా విప్లవించి కార్మిక కర్షక అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు.

రాజకీయ కారణాలు

విప్లవానికి ముందు రష్యాను రోమనోవ్ వంశస్తులు పాలించారు. మొదటి పాలకుడు మొదటి పాల్ నుండి ఆఖరి చక్రవర్తి నికొలస్ రెండవ వరకు అందరూ నిరంకుశ వైఖరినే అనుసరించారు. ఒకటవ పాల్ పాలన ఉన్మాదాత్మకంగా ఉండేది. మొదటి అలెగ్జాండర్ ఆదర్శవాది అయినా మెటర్నిక్ ప్రభావానికి లోనై నిరంకుశుడుగా వ్యవహరించాడు. ఇతని కాలంలోనే రష్యామీద దండయాత్రతో ఫ్రెంచ్ విప్లవం గురించి రష్యనులకు క్షుణ్ణంగా తెలిసింది. 1815 వియన్నా కాంగ్రెస్ కు హాజరైన మొదటి అలెగ్జాండర్ అక్కడ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలలో భాగమయ్యాడు. రష్యాలో 1822లో జరిగిన తిరుగుబాటును మొదటి అలెగ్జాండర్ అణచివేసాడు. 19వ శతాబ్దంలో రష్యాలో తిరోగమన పురోగమన వాదులమధ్య సంఘర్షణ జరిగింది. మొదటి నికొలస్ తో రష్యాలో నిరంకుశత్వం స్ధిరపడింది.

ఫ్రాన్స్ లో జరిగిన  1830, 1848 విప్లవాల ఫలితం రష్యామీద పడింది. సాంఘిక రాజకీయ వ్యవస్ధల్లో మార్పుకోరేవారిని అణచివేయడానికి నికొలస్ మూడవ విభాగం అని పిలువబడే గుడాచారి విభాగాన్ని ఏర్పరచాడు. పత్రికలపై ఆంక్షలు, ప్రవాస శిక్షలు విదించి, విదేశీ గ్రంధాలపై నిషేదం విధించినా శూణ్యవాద, సామ్యవాద భావాల ఉద్బవం మాత్రం ఆపలేకపోయాడు.

రెండవ అలెగ్జాండర్ మొదట ఉదారయుత పాలనను అందించినా అతని రూసీకరణ వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. విధ్యావిధానాన్ని నియంత్రించి, విదేశీ ప్రయాణాలను నిషేదించాడు. పోలెండ్ పై రూసీకరణ ఫలితంగా తిరుగుబాటు సంభవించింది. రెండవ అలెగ్జాండర్ కు వ్యతిరేకంగా శూణ్యవాదం పెరిగి, చివరికి శూణ్యవాదుల చేతిలోనే మరణించాడు.

మూడవ అలెగ్జాండర్ కూడా నిరంకుశవైఖరిని అనుసరించాడు. తీవ్రవాదులను అణచివేయడానికి “ఒక్రానా” అనే గుడాచారి శాఖను ఏర్పరచాడు.

రష్యా ఆఖరు చక్రవర్తి రెండవ నికొలస్, అతని భార్యకు ప్రజాసంక్షేమం పై దృష్టిలేదు. పైగా వారిద్దరూ పవిత్ర భూతం (Holy Devil)గా పిలువబడే కపటసన్యాసి గ్రెగరీ రస్పూటిన్ ప్రభావానికి లోనై ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. పారిశ్రామికీకరణ అనంతరం తీవ్ర కార్మిక సంక్షోభం తలెత్తింది.

 సాంఘిక కారణాలు

రష్యా భూస్వామ్య దేశం. రైతుల్లో అధిక భాగం సెర్ఫ్ లు అని పిలువబడ్డ అర్ధబానిసలు. పన్నుల భారమంతా రైతులు, సామాన్య ప్రజలపై పడేది. రెండవ నికొలస్ భానిస వ్యవస్ధను నిషేదించినా, వారు మీర్ ల ఆధీనంలోకి వెళ్ళడంవల్ల వారి పరిస్ధితిలో మార్పు రాలేదు. గ్రామ సమాజాలు భూస్వాములనుండి భూమిని తీసుకుని వాటిని సేధ్యభానిసలకు వాయిదాల పధ్ధతిలో డబ్బుచెల్లించే ఒప్పందం ప్రకారం ఇవ్వాలి. మీర్ లు నిస్సారమైన భూమిని ఇవ్వడం వల్ల సేధ్యభానిసలు నష్టపోయారు. భూస్వాములు పన్నులనుండి మినహాయించబడ్డారు. సైన్యంలో ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలలో భూస్వాములే ఉండేవారు. కులక్ లు అనే వడ్డీ వ్యాపారులు కూడా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధికి ఏ సంస్కరణలు చేపట్టలేదు. చివరికి రైతులు భూమికోసం భుక్తికోసం విప్లవించారు.

పారిశ్రామిక కారణాలు

పారిశ్రామికీకరణ ప్రభావం రష్యాపై ఆలస్యంగా పడినా పారిశ్రామికీకరణ రష్యాను విప్లవానికి చేరువచేసింది. మూడవ అలెగ్జాండర్ కాలంలోని ఆర్ధిక మంత్రి డివిట్, రష్యాను పారిశ్రామికీకరించడంలో విశేష కృషి చేసాడు.

రక్షణ సుంకాలను ప్రవేశపెట్టి విదేశీ సరుకుల పోటీని తగ్గించాడు. రైల్వేల నిర్మాణంగావించాడు. ట్రాన్స్ సైబీరియన్ రైలు మార్గ నిర్మాణం ఇతని కాలంలోనే ప్రారంభమైంది.

రష్యాలో బానిస విమోచన చట్టం అనంతరం భూస్వాములు పారిశ్రామిక రంగంపై కాకుండా రాజకీయ రంగంపైనే దృష్టిని సారించారు. రష్యా పరిశ్రమలు విదేశీ గుత్తాధిపత్యం కింద అభివృద్దిచెందాయి.

1854లో మొధటి నికొలస్ పాలనా కాలంలో 9,944 పరిశ్రమలు, 46,000మంది కార్మికులు ఉండగా

1896 లో రెండవ నికొలస్ పాలనా కాలం నాటికి పరిశ్రమల సంఖ్య 38,401 కి చేరుకుని కార్మికుల సంఖ్య లక్షల్లో ఉండేది.

పెరిగిన కార్మికుల సంఖ్యకు అనుగుణంగా వారి వాడల్లో సౌకర్యాలను, కార్మిక చట్టాలను మెరుగు పరచలేదు. కార్మికులు తీవ్ర అనారోగ్య వాతావరణంలో జీవించారు. కార్మికులు తీవ్ర శ్రమదోపిడీకి గుర్యయారు. మహిళలు, చిన్నపిల్లలు రాత్రిపూట కూడా నిర్బందంలో పనిచేయాల్సివచ్చింది. వీటికి తోడు అధిక ధరలు వారి జీవితాన్ని మరింత కష్టతరం చేశాయి. పై కారణాల వల్ల సామ్యవాద భావాలకు బలం చేకూరి, శ్రామికులు వారి హక్కులకోసం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు.

సైనిక కారణాలు

రష్యన్ సైనికాధికారుల్లో నిపుణత క్షీణించింది. వారిలో అవినీతి పెరిగి అనాలోచిత వ్యూహరచనలు చేశారు. యుధ్ధ పరిశ్రమల అధినేతలు, జార్ మంత్రులు యుద్దాన్ని డబ్బు సంపాదించే ఉపకరణగా భావించారు. 1904-1905 యుద్దంలో చిన్న దేశమైన జపాన్ చేతిలో రష్యా ఓటమి వల్ల రష్యా సైనికుల్లో అనేక సందేహాలు ఉద్బవించాయి. 1905లో నౌకాదళ తిరుగుబాటు సంబవించింది. తిరుగుబాటుల్ని అణచడానికి నియమింపబడిన సైనికులు, తిరుగుబాటు దారులపట్ల సానుకూలతతో ఉండి, ప్రజలపై దాడులు చేయడానికి సంకోచించారు. సైనికులకు ప్రజలకు మధ్య విప్లవ స్నేహ సంబంధాలు నెలకొన్నాయి. సరైన నాయకత్వ ప్రతిభలేని సైనికాధికారుల క్రింద పనిచేస్తున్న సైనికులు తమ కోరికలు, లక్ష్యాలు ప్రజలతోనే ముడిపడి ఉన్నాయని గుర్తించారు. సైనికులు ప్రజలతో కలిసి విప్లవాన్ని బలోపేతం చేశారు.

 

వివిద రాజకీయ పక్షాలు

రష్యాలో దిగజారిన పరిస్ధితులవల్ల విసిగిపోయిన ప్రజలు మేధావుల రచనల వల్ల ప్రభావితులై రహస్య సంఘాలను స్ధాపించారు మరియు రాజకీయ పక్షాలుగా ఏర్పడ్డారు. ల్యాండ్-లిబర్టీ అనే విప్లవ ప్రజా సంఘం ఏర్పడి పోరాడింది. హెల్ అనే ప్రజాసంఘం ప్రజల రాజ్యాంగం కావాలని కోరింది. మైఖేల్ బకూనిస్ చే ప్రారంభించబడిన శూణ్యవాదం (Nihilism) చాలా ప్రజాధరణను పొందింది. భ్రష్టుపట్టిన వ్యవస్ధలన్నింటినీ కూకటివేళ్ళతో పెకిలించివేయాలని చెప్పే శూణ్యవాదం పట్ల యువకులు ఎక్కువ సంఖ్యలో ఆకర్షితులయ్యారు. కానీ ప్రత్యామ్నాయ వ్యవస్ధపట్ల అవగాహన లేని శూణ్యవాదం అరాచకవాదంగా మిగిలిపోయింది. శూణ్యవాదులు రెండవ అలెగ్జాండర్ ను హతమార్చి, మూడవ అలెగ్జాండర్ మీద హత్యా ప్రయత్నం చేశారు.

శూణ్యవాదం ఏర్పరచిన బాటలో నడుస్తూ సామ్యవాదం నిర్మాణాత్మకంగా, విప్లవానంతర వ్యవస్ధపై స్పష్టమైన అవగాహన కలిగిఉండి విజయాన్ని సాధించింది.

టాల్ స్టాయ్ వంటి రచయితల ప్రభావంతో క్రైస్తవ సామ్యవాదులు నైతిక ప్రవర్తన, సాంఘిక సంస్కరణ ఆవశ్యకతను ప్రజలకు తెలియపరచారు. పద్దెనిమిదవ శతాబ్ధం చివరి దశలో రష్యాలో నరోద్నిక్ లు అనే సామ్యవాద విప్లవకారులు కర్షక విప్లవ సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు.

మార్క్స్ సిధ్దాంతాల ప్రాతిపదికపై సాంఘిక విప్లవ పార్టీ ఏర్పడి బలాన్ని పుంజుకుంది. ఈ పార్టీ 1903లో బోల్ష్ విక్ లు, మెన్ష్ విక్ లు అనే రెండు పక్షాలుగా విడిపోయింది.

మితవాదులైన మెన్ష్ విక్ లు ప్లెకనోవ్ నాయకత్వంలో మధ్యతరగతి ఉదారవాదుల సహకారంతో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్ధాపన జరిగిన తరువాతే సోషలిస్ట్ విప్లవం సాధ్యమవుతుందని భావించారు.

అతివాదులైన  బోల్ష విక్ లు కార్మికులకు మిత్రులు కర్షకులే అని, మధ్యతరగతి కాదని, కార్మిక కర్షక సమన్వయంతో సామ్యవాద విఫ్లవాన్ని సాధించవచ్చని వాదించారు. బోల్ష్ విక్ ల ఆకాంక్షల ప్రకారం రష్యాలో శ్రామిక నియంతృత్వం ఏర్పడింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *